తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేశారు. ఈ పరీక్ష కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ లింక్‌ను ఆన్లైన్లో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. లాగిన్ అయ్యాక కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే ఇచ్చిన టెక్స్ట్ బాక్స్‌లో ఇంగ్లిష్‌లో తెలపవచ్చని పేర్కొంది.
అలాగే, కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను (ఉదా: రచయిత పేరు/ఎడిషన్/పేజీ నంబర్/పబ్లిషర్స్ పేరు/వెబ్సైట్ యూఆర్ఎల్ వంటివి) అప్లోడ్ చేయవచ్చని కమిషన్ సూచించింది. ఈమెయిల్స్, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది.
అలాగే, నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని పేర్కొంది. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
మరోవైపు రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయని తెలిపింది.