తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సాయంత్రం తన కొత్త మంత్రివర్గంతో తొలి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన విద్యుత్ శాఖ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిచారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని ఆయన చెప్పారు. పైగా, విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆయన అధికారులను ఆదేశించారు. ఈ తొలి మంత్రివర్గ సమావేశంలోనే విద్యుత్ శాఖపై లోతుగా చర్చ జరిగింది.
విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలా కాలంగా దాచిపెడుతున్న విషయాలను తప్పుబడుతూ ఆ శాఖ ఉన్నతాధికారి అయిన సీఎండీపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు.
పైగా, దీనిపై శుక్రవారం సమీక్ష చేద్దామంటూ ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించవద్దని, శుక్రవారం నాటి సమీక్షా సమావేశానికి ఆయనను కూడా పిలవాలని సీఎం ఆదేశించారు. పైగా, సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.