తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు కాలికి గాయమైంది. జారి కిందపడటంతో ఆయన కాలికి గాయమైంది. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది.
ఆయనకు తుంటి ఎముక విరిగినట్టు యశోద ఆస్పత్రి వైద్యులు జరిపిన వైద్య పరీక్షలు, స్కానిక్, ఎక్స్‌రేలలో తేలింది. పైగా, దీనికి ఆపరేషన్ కూడా చేయాల్సి రావొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత శస్త్ర చికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, ఈ నెల 3వ తేదీన వెల్లడైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి పార్టి చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. మొత్తం 119 స్థానాలకుగాను ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. దీంతో గత తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయి.. అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి ఆయన ఫామ్‌హౌస్‌లో జారిపడటంతో కాలికి గాయమైంది.