తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే క్రమంలో వారం వారం రూ.200 చెల్లించలేక ఓ దంపతుల జంట ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి ఇద్దరు పిల్లలు ఇపుడు అనాథలుగా మిగిలిపోయారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) భార్యాభర్తలు. వీరికి రిషి (14), జశ్వంత్ (12) అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. దేవేందర్, చందన ఇద్దరూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఈ క్రమంలో గ్రామంలోని మహిళలు ఓ గ్రూపుగా ఏర్పడి ఓ ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారి వద్ద రూ.2.50 లక్షల అప్పు తీసుకున్నారు. దీనికి చందన వంతుగా ప్రతి వారం రూ.200 చెల్లించాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా చెల్లించినా ఇటీవల భర్త, పిల్లలు అనారోగ్యం బారినపడడంతో కిస్తీలు కట్టడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఫైనాన్స్ వ్యాపారి నుంచి ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చందన డిసెంబరు 6వ తేదీన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతున్న భార్య పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20వ తేదీన ఇంట్లో ఉరివేసుకున్నాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన మంగళవారం తుదిశ్వాస విడిచింది. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.