కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్లు తమ వాదనల్లో ప్రభుత్వ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారీ వాహనాల ద్వారా చెట్లను నరికివేస్తూ, భూమిని చదును చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, ఏప్రిల్ 3వ తేదీ (గురువారం) వరకు ఏ కార్యకలాపాలు జరపకూడదని ఆదేశించింది. అలాగే, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
వన్యప్రాణులు, సహజ సిద్ధంగా ఏర్పడిన రాక్స్, మూడు నీటి మూలాలు (లేక్స్) ఇక్కడ ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని లాయర్లు వాదించారు. వన్యప్రాణుల సంరక్షణ ఉన్న ప్రదేశంలో భూమిని చదును చేయాలంటే ముందుగా నిపుణుల కమిటీ పర్యటించాలి. కనీసం నెల రోజుల పాటు అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
కానీ ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గౌరవించకుండా అధికారుల తీరును చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు గురువారం వరకు వాయిదా వేసింది.
కాగా కంచ గచ్చిబౌలి భూమిని వేలం వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మార్చి 3న ప్రకటించిన తర్వాత గత మూడు వారాలుగా నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ చర్య విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు, పౌర సమాజ సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి తీవ్రమైన పర్యావరణ పరిణామాలను కలిగిస్తుందని వారు వాదిస్తున్నారు.