Publish Date: Sat, 28 Mar 2026 (18:03 IST)
Updated Date: Sat, 28 Mar 2026 (18:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇసుక దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. గత తెరాస ప్రభుత్వంలో జరిగిన మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు.
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, 'సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణ జరిపిస్తాం. సంతోష్‌రావు, ఆయన తండ్రి రవీందర్‌రావుపై విచారణకు ప్రభుత్వం సిద్ధం. గంగుల కమలాకర్ అక్రమ గ్రానైట్ మైనింగ్, వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్‌పై విచారణకు సిద్ధం. రాఘవ కన్‌స్ట్రక్షన్‌తోపాటు అన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నాం.
విచారణలో నిజాలు నిగ్గు తేల్చి శాసనసభలో నివేదిక పెడతాం. ఇసుక మాఫియా, అక్రమాలకు పాల్పడింది బీఆర్‌ఎస్ నేతలు, వారి బంధువులే. వద్దిరాజు రవిచంద్ర వంటివారిని బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారు. స్వయంగా హరీశ్‌రావు తమ్ముడు మహేశ్వర్‌రావు ఇసుక మాఫియా నడిపారు. అతడి అక్రమాల వల్లే కేటీఆర్ మైనింగ్ శాఖను తీసుకున్నారు'
అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఏపీలో వైకాపా ఇకపై అధికారంలోకి రానేరాదు : పవన్ కళ్యాణ్ జోస్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఇకపై అధికారంలోకి రానేరాదని జనసేన పార్టీ అధినే, సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్చించే అంశంపై తీర్మానం చేసేందుకు వీలుగా శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేవని, చంద్రబాబు బలమైన ఆశావాది కాబట్టి.. కార్యాలయాలు లేకపోయినా టెంట్ వేసుకొనైనా పని చేద్దామని ఆశించారన్నారు.
'రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా.. ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు లేదని తలచుకుంటే బాధేస్తోంది. అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. తెలంగాణ వేరు, ఆంధ్రా వేరు అనే భావన నాకు లేదు.. తెలుగునేల అనే భావన ఉండేది. ఏపీపై ఉన్న గౌరవం వల్లే.. 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చాను. రాజధాని కోసం మెజార్టీ రైతులు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు రాజధాని కోసం సేకరించారు. 2019లో ప్రభుత్వం మారాక.. అమరావతిపై కక్ష కట్టారు. అమరావతి రైతులకు మద్దతుగా నేను వెళ్తే.. ముళ్ల కంచెలు వేశారు. వైకాపా హయాంలో శాసనసభ్యులకే రక్షణ లేకపోతే.. రైతులకు ఎలా ఉంటుంది? రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వైకాపా హయాంలో హింసించారు.
వైకాపా హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. రాజధాని సమస్యను పరిష్కరించకపోగా.. కఠినం చేశారు. వైకాపా మళ్లీ వస్తే.. పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైకాపా మళ్లీ రాదు.. వచ్చినా ఏం చేయలేదు. అమరావతి రైతుల కోసం మనమంతా ఒకే మాటపై ఉండాలి. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు.. దీనికి కట్టుబడి ఉన్నాం. చట్టసభల్లో కూర్చొని దాడులు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉంటేనే.. పెట్టుబడులు వస్తాయి. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేటప్పుడు చంద్రబాబును అందరూ విమర్శించారు. ప్రపంచబ్యాంకుతో కుమ్మక్కయ్యారని ఆరోపించేవాళ్లు. రాజకీయ నేత ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. దార్శనికుడు ఒక తరం గురించి ఆలోచిస్తాడు అని పవన్ పేర్కొన్నారు.