Publish Date: Thu, 18 Dec 2025 (20:32 IST)
Updated Date: Thu, 18 Dec 2025 (20:34 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ వద్ద ఉన్న 102 ఎరకాల భూమి తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
సాహెబ్‌నగర్ వద్ద ఉన్న 102 ఎకరాల భూమిపై దాదాపు 20 ఏళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతోంది. ఈ భూమిపై యాజమాన్య హక్కులు కోరుతూ నిజాం, సాలార్ జంగ్, మీరాలం వారసులమంటూ పలువురు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో పిటిషన్లు వేసిన 260 మందికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనం.. ఇది పూర్తిగా అటవీ భూమి అని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువడిన 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రతిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని ధర్మాసనం ఆదేశించింది.