తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో పలువురు అభ్యర్థులు వివిధ పదవుల కోసం పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు తమ భార్యలను అడ్డుపెట్టుకుని అధికారం చెలాయించేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇందులోభాగంగా ఓ దళిత యువకుడు సర్పంచ్ పదవి కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ మహిళను ఆగమేఘాలపై వివాహం చేసుకున్నాడు. ఈ తొందరపాటుతో అసలు విషయం మరిచిపోవడంతో ఫలితం మాత్రం దక్కలేదు.
ఈ ఆసక్తికర వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల పరిధిలోని ఓ గ్రామ సర్పంచి స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వు అయింది. దీంతో గ్రామానికి చెందిన యువకుడు ఒకరు ఈ అవకాశాన్ని అందింపుచ్చుకోవాలని ప్రణాళిక రచించాడు. ఇందులోభాగంగా, నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్సీ మహిళను హడావుడిగా ఈ నెల 26వ తేదీన వివాహం చేసుకున్నాడు.
అయితే, తన భార్య పేరును గ్రామ ఓటర్ల జాబితాలో చేర్చడం మరిచిపోయాడు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నోటిఫికేషన్ వెలువడటంతో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే గడువు ముగిసింది. ఫలితంగా అతని భార్య పేరు ఓటరు జాబితాలో నమోదు కాలేదు. నామినేషన్ వేయడానికి ఆమెకు అర్హత లేకుండా పోయింది. సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ యువకుడి కల నెరవేరలేదు.