Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రి పడకపై ఇంకా అచేతనంగానే శ్రీతేజ్!

Advertiesment
stampede at Sandhya Theater

ఠాగూర్

, గురువారం, 30 జనవరి 2025 (10:32 IST)
పుష్ప-2 చిత్రం బెన్ఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంకా అచేతనంగానే ఉన్నాడు. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి (32) ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఇందులో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ తొక్కిసలాట ఘటన జరిగి 56 రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సీపీఆర్ చేశారు. వెంటనే సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు. కొన్ని రోజులపాటు ఐసీయూలో వెంటిలేటరుపై చికిత్స అందించారు. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్‌ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి అతను ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. పేరుపెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడలేడు. నోరు విప్పి మాట్లాడలేడు. ఇప్పటివరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు.
 
వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 
 
ఆ రోజు బాలుడిని జనం తొక్కుకుంటూ పోవడంతో కొంత సమయంపాటు అతని ఊపిరి ఆగిపోయింది. సీపీఆర్ తిరిగి శ్వాస అందుకున్నాడు. ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తోంది. సినిమా ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీతేజ్ మాత్రం ఎన్నడు కోలుకుంటాడో.. మళ్లీ బడికి వెళతాడో.. డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడో... అని అతని తండ్రి, చెల్లెలు కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ వార్తాపత్రిక దినోత్సవం 2025- జర్నలిజంలో AI పాత్ర