Publish Date: Fri, 24 Apr 2026 (20:34 IST)
Updated Date: Fri, 24 Apr 2026 (20:36 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేరు ఇటీవలికాలంలో వార్తల్లో బాగా వినిపిస్తోంది. ఆమె ఏ పని చేసినా అది ప్రధాన వార్తగా ప్రచురితమవుతోంది. తాజాగా ఆమె హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో సమావేశమయ్యారు. దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు.
తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను విద్యావేత్తను అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. తాను అన్ని పార్టీల నేతలను కలుస్తుంటానని చెప్పారు. డిజిటల్ ఇండియా కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్టు చెప్పారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టు ఆమె తెలిపారు.