తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ వడ్డీ వ్యాపారిపై బాధితులు తిరగబడ్డారు. రూ.10 కోట్లు ఎగ్గొట్టినందుకు ఈ వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి తెగబడ్డారు. ఇంటిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తండాకు చెందిన బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి.. స్థానికులకు అధిక వడ్డీ ఆశచూపి భారీ మొత్తంలో వసూలు చేశారు. ఇలా రూ.10 కోట్ల మేరకు వసూలు చేశారు. ఆ తర్వాత తిరిగి డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆగ్రహించిన బాధితులు వడ్డీ వ్యాపారి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
రూ.10 కోట్ల మేరకు వసూలు చేసిన ఆయన.. ఐపీ పెట్టి కోర్టుకు పోయి 300 మందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు పెద్ద ఎత్తున మంగళవారం వడ్డీవ్యాపారి ఇంటికి తరలివచ్చి ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది.