సినిమాల పైరసీ కేసులో అరెస్ట అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమండి రవి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీ సంపాదనతో రూ.కోట్లను తన ఖాతాలో జమ చేయించుకునే రవి.. ఆ డబ్బుతో వారానికో దేశంలో పర్యటిస్తూ జల్సాలు చేసేవాడు. అక్కడ తనకు నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ లగ్జరీ జీవితాన్ని గడిపేపాడు. ముఖ్యంగా, రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లో పౌరసత్వం కూడా పొందాడు.
ఇటీవల అరెస్టయిన రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఇందులో అనేక విషయాలను రాబట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ వారానికో దేశం చొప్పున తిరిగేవాడని, ఈజీ మనీకి అలవాటు పడినట్టు ఐబొమ్మ రవి వెల్లడించారు. ముఖ్యంగా లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కూడా కొనుగోలు చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు.
అలాగే, కొత్త సినిమాల పైరసీ కేసులో ప్రధాన సూత్రధారి ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అన్నీ తానై నడిపించాడని, తమిళ వెబ్సైట్ల నుంచి పైరసీ సినిమాలు కొనుగోలు చేసి వాటిని హెచ్డీ క్వాలిటీగా మార్చి ఐబొమ్మ, బప్పం టీవీల్లో అప్లోడ్ చేసేవాడని పోలీసులు తెలిపారు.
కాగా, ఇమండి రవి వద్ద ఐదు రోజుల పోలీసు కస్టడీలో నిందితుడి నుంచి కీలక ఆధారాలు సేకరించామని, అతనొక్కడే ఇదంతా చేసినట్టు సాంకేతిక ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. పైరసీ దందాలో ఐ బొమ్మ రవి అవలంబించిన పద్ధతులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.