తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన ఎన్. సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే విధుల నుంచి తొలగించారు. డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగించబడిన సుమంత్.. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి మఫ్టీలో ఉన్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులుగా మంత్రి ఇంటికి వచ్చారు.
సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ నలుగురు వ్యక్తులపై సుస్మిత ప్రశ్నల వర్షం కురిపించారు.
తాము ఏ ప్రభుత్వంలో ఉన్నామో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమంత్‌పై నమోదైన కేసు వివరాలు స్పష్టంగా చెప్పకుండా, అరెస్ట్ వారెంట్ చూపించకుండా తమ ఇంట్లోకి ప్రవేశించేది లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు.
మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి గన్‌మెన్లను తొలగించారని.. రేవంత్‌రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి పార్టీకి ఏం చేశారని, వారికి ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించిందని ప్రశ్నించారు.
ఇకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి మా అమ్మను చాలా సార్లు నోటికి ఇష్టమొచ్చినట్లు అసహనంగా మాట్లాడేవారని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపించారు. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము ప్రశాంతంగా ఉన్నాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మీదే కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒకడు, పొంగులేటి ఒకడు, వేం నరేందర్ రెడ్డి ఒకడు వీళ్ళందరూ మా మీద పగబట్టారు.. అంటూ కొండా సుస్మిత తెలిపారు.