తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ నేరాలకు పాల్పడిన ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నారు. పబ్ వద్దకు ప్రభాకర్ వచ్చాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై... ప్రభాకర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతని వద్ద జరిపిన విచారణలో పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా అనేది యూట్యూబ్ వీడియోలు చేసి నేర్చుకునేవాడని డీసీపీ వినీత్ తెలిపారు.
ఇప్పటిదాకా బత్తుల ప్రభాకర్ 66 కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. 2022లో అనకాపల్లి కోర్టుకు తీసుకెళుతున్న సమయంలో తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి పట్టుబడక తిరిగాడు. కానీ గత రాత్రి అరెస్ట్ అయ్యాడు.
ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ పై కాల్పులు జరపడంతో, ఆ కానిస్టేబుల్ కాలికి గాయమైందని డీసీపీ చెప్పారు. విచారణలో భాగంగా అతడిచ్చిన సమాచారంతో అతడి నివాసంలో సోదాలు జరిపి 428 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు.