హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం అనేక ప్రాంతాల్లో జనజీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఉప్పల్, హబ్సిగూడ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం తాళలేని విధంగా కురిసింది. వీధులన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కొన్ని ప్రాంతాల్లో కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అక్కడ రోడ్డు మీద నీరు నదిలా ప్రవహిస్తోంది.అక్కడ రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. నాలాల నుంచి మురుగు నీరు బయటికి పొంగి రోడ్లపైకి వచ్చేసింది.
ఈ నేపథ్యంలో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌లోకి నాలుగు అడుగుల వరద నీరు చేరింది. ఈ ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. వెంటనే పోలీసులకు, డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలకు సమాచారం ఇచ్చారు.
హైడ్రా సిబ్బంది చిన్న పడవల సహాయంతో వెనుకవైపు నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.