హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా రోడ్లపై నీళ్లు చేరి ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. ప్రజలు బయటికి రావద్దంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ముషీరాబాద్, చిక్కడపల్లి, ఎల్బీనగర్, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షానికి రోడ్డన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఐటీ కారిడార్‌తోపాటు సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. బలమైన గాలులు, మెరుపులతో వర్షం కురుస్తున్నందున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.