ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. కన్నకూతురును చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పల్లి ప్రాంతంలో నివాసం ఉండే అశోక్ (50) తన భార్య సోని, కూతురు దివ్య (5)లతో కలిసి ఇందిరమ్మ కాలనీలో అద్దెకుంటున్నారు. ఆయన భార్యకు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొట్టడంతో ఆ కాలు తీసేశారు.
అప్పటి నుంచి సోని ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు అశోక్‌కూ ఎప్పుడో ఒకసారి తప్ప పెద్దగా పనులు దొరకడం లేదు. పనిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో ఆ కుటుంబానికి జీవితంపై విరక్తి కలిగింది. దీంతో చేసేది లేక 3 రోజుల క్రితం రాత్రి ఇంట్లో గ్యాస్ లీక్ చేసి.. కుటుంబ సభ్యులంతా చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్లే గ్యాస్ లీక్ చేశారు. అయితే ఈ ప్రయత్నం విఫలమైంది. అయినా అశోక్ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. మరునాడు కూతురు దివ్యను తీసుకుని బయటకెళ్లిన అశోక్.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాల వెనుక ఉన్న చెరువులో దూకారు.
మరునాడు వారి శవాలు తేలాయి. మృతులు ఇందిరమ్మ కాలనీ వాసులని స్థానికులు చెప్పడంతో అశోక్ భార్య సోనికి సమాచారం అందించారు. ఆమె ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.