Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం... మరో గ్యారెంటీకి అమలకు సిద్ధం...

revanth reddy

ఠాగూర్

, సోమవారం, 11 మార్చి 2024 (08:21 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. భద్రాచలంలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ పథకం ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు సోమవారం ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్ట నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గాన నేరుగా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి వెళ్తారు. రాములోరి దర్శనం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. సుమారు 5 వేల మంది మహిళలు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. అనంతరం భద్రాచలంలోనే నీటిపారుదల, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పలు అంశాలపై సీఎం రేవంత్, మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. 
 
ఆ తర్వాత మణుగూరులో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 6.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎం కార్యాలయం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది.
 
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వం స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందజేయనుంది. విడతల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరినీ గర్తించి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈ స్కీమ్ కూడా ఉంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఈ ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టాన్‌ఫోర్డు వర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లకు కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో!!