తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మానవ వనరుల సంస్థలో మర్రి చెన్నారెడ్డి ఐదు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల వారీగా నేతలతో సమావేశమయ్యారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని నేతలకు సీఎం సూచించారు.
ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రోజూ సాయంత్రం ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
వారంలో కనీసం మూడు రోజులైనా ఎమ్మెల్యేలకు సీఎం అందుబాటులో ఉంటారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించాలని నిర్ణయించారు.
ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక వనానికి శంకుస్థాపన చేసేందుకు ఆదిలాబాద్ నాయకులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని జిల్లా నేతలకు సీఎం హామీ ఇచ్చారు.
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి జిల్లాల ఇన్ చార్జి మంత్రులకు అప్పగించారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని భరోసా ఇచ్చారు. తాను గత సీఎంలా కాదని నేతలకు చెప్పారు.
వారంలో మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని, పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సీఎం సూచించారు.