హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్లు మృత్యురహదారిగా మారిపోయింది. ఈ రహదారిలో ఏదేని ప్రమాదం జరిగితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం లేదు. తాజాగా ఓఆర్ఆర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎమ్మెల్యే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆమె పేరు లాస్య నందిత. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే.
ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రహదారిపై ప్రమాదానికి గురైంది. పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఎక్స్‌ఎల్ 6 రకం కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు ఆకాశ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.