ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగం రావడంతో ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. ఈ ఆనందాన్ని తన స్నేహితులతో పంచుకోవాలని వారికి మందు పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత మద్యం మత్తులో కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తితో ఈ కేసులోని నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ నగర పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... తుకారంగేట్‌కు చెందిన కొవ్వూరి రుత్విష్ రెడ్డి (21), లాలాపేటకు చెందిన లోకేశ్వరరావు (21), మౌలాలికి చెందిన బి.అభిలాష్ (20), వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన మగ్దంపల్లి అనికేత్ (22), సికింద్రాబాద్‌కు చెందిన వైష్ణవి (23)గా గుర్తించారు. ఫిరోజ్‌గూడకు చెందిన రుత్విష్ రెడ్డి బంధువు జి.సురేశ్ రెడ్డి (27) పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
మద్యం పార్టీ ఇచ్చిన రోజున ఏం జరిగిందన్న దానిపై పోలీసులు స్పందిస్తూ, రిత్విష్ రెడ్డికి ఇటీవల అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందంలో పార్టీ ఇస్తానని స్నేహితులను పిలిచి తన సోదరి కారులో బయలుదేరాడు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌లో మద్యం కొన్నారు. రుత్విక్‌తో పాటు మరొకరు మద్యం తాగుతూనే కారులో పలు ప్రాంతాలు తిరిగారు.
ఆఖరులో అమెజాన్ కార్యాలయం వద్దకువెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో మాదాపూర్ బిర్యానీని ఆరగించారు. రుత్విష్ రెడ్డి వేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36/10 వద్ద అదుపు తప్పి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఆ బైకుపై స్నేహితుడు ఏసురాతో కలిసి వెళ్తున్న గాంధీ నగర్‌కు చెందిన బౌన్సర్ లింగాల తారకరామ్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తారకరామ్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన నిందితులు అదే వేగంతో బీహెచ్ఎల్ వెళ్లారు. అనంతరం ఫిరోజ్ గూడ వచ్చి కారును అక్కడే వదిలేసి సురేశ్ రెడ్డి కారులో మళ్లీ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ తారకరామ్ మృతదేహం, పోలీసులు ఉండడం చూసి అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సీసీటీవీ కెమెరాలో నిందితుల కారును గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సురేశ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.