Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్ఛరించలేదు.. ఆ 2 రాష్ట్రాల కోసమే బడ్జెట్ : భారాస నేత వినోద్

Advertiesment
vinod kumar

వరుణ్

, మంగళవారం, 23 జులై 2024 (16:04 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, బీఆర్ఎస్ సీనియర్ నేత బి.వినోద్ మరింతగా మండిపడుతున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కోసమే ఈ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ మండిపడ్డారు. విత్తమంత్రి నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్ఛరించలేదని ఆయన గుర్తుచేశారు. 
 
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేటాయింపులు చేస్తామని విత్తమంత్రి చెప్పారని, ఆ ప్రకారమే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి యేటా రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. అవసరమైతే ఇతర ఏజెన్సీల ద్వారా నిధులు సమకూర్చుతామని వెల్లడించారు. అలాగే, విశాఖపట్టణం నుంచి చెన్నైకు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ఆమె పచ్చజెండా ఊపారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం హైదరాబాద్ - బెంగుళూరు కారిడార్ గురించి ప్రస్తావించారన్నారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు ప్రాంతాల మధ్య దూరం కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే తెలంగాణాలో ఉంటుందని, మిగిలిన ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందని తెలిపారు. నిజంగా తెలంగాణాకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించదలచుకుంటే హైదరాబాద్ - నాగ్‌పూర్  కారిడార్‌ను ప్రకటించాలని కోరారు. దానివల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎంతో అనువుగా ఉంటుందని తెలిపారు. 
 
అలాగే, ఏపీలోని పోలవరం ప్రాజెక్టును జీవనాడిగా పేర్కొన్న కేంద్ర విత్తమంత్రి... ఇప్పటికే చాలా కేటాయింపులు చేశారని, మరింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారని, అలా చేయడంలో తప్పు లేదన్నారు. కానీ, తెలంగాణాలో గోదావరి, కృష్ణానదిపై జాతీయ ప్రాజెక్టుల గురించి చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని, ఈ బడ్జెట్‌ను కేవలం చంద్రబాబు, నితీశ్ కుమార్‌లకు చెందిన రాష్ట్రాలకే పెద్దపీట వేశారని, వారి కోసమే తయారు చేసినట్టుగా ఉందని పేర్కొన్నారు. 
 
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు తలా 8 చొప్పున ఎంపీ సీట్లను తెలంగాణ ప్రజలు గెలిపించారని, ఈ 16 మంది రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ నిధులు శూన్యం అని ఆయన ఆరోపించారు. కనీసం బడ్జెట్ చర్చలో అయినా ఈ 16 మంది ఎంపీలు పాల్గొని విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, నవోదయ విద్యాలయాలు, జాతీయ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల కోసం పట్టుబట్టాలని, ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ - బీహార్ రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట - వార్షిక బడ్జెట్‌లో వరాల జల్లు!!