గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోల్కొండ ఎంఐఎం కార్పొరేటర్ ఫరీద్ ఖాన్ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. 15 రోజుల క్రితం ఫరీద్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఇటీవలే నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. రెండు, మూడు రోజుల క్రితం ఖాన్ మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫరీద్ ఖాన్ ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫరీద్ ఖాన్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖాన్ మృతిపట్ల ఎంఐఎం నేతలు సంతాపం ప్రకటించారు.
ఇదిలావుంటే, తెలంగాణలో శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల మధ్య 4,009 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 1,878 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,14,441 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,838గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 39,154 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 705 మందికి కరోనా సోకింది.