Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్ఎస్ఎస్‌ అనుబంధంతో మొదలై.. ఒక్కో మెట్టు ఎక్కుతూ... సీఎం స్థాయికి... రేవంత్ ప్రస్థానం...

revanthreddy
, ఆదివారం, 3 డిశెంబరు 2023 (20:12 IST)
అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మార్మోగిపోయిన పేరు. ఆర్ఎస్ఎస్‌ అనుబంధంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సొంత పార్టీనే ధిక్కరించి జిల్లాపరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు.. వివాదాలు. ఓటములు, అవినీతి ఆరోపణలు, స్వపక్షం నుంచే విమర్శలు ఎదురైనా.. మాస్ ఫాలోయింగ్‌‍తో వాటన్నింటినీ ఎదుర్కొంటూనే తనదైన దూకుడుతో దూసుకెళ్లారు. జనాకర్షక నేతగా ఎదిగారు. ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందించారు. ఆయన జీవిత ప్రయాణాన్ని పరిశీలిస్తే..
 
ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని కొండారెడ్డిపల్లిలో 1969లో రేవంత్ రెడ్డి జన్మించారు. తండ్రి అనుముల నర్సింహరెడ్డి, తల్లి రామచంద్రమ్మ. రేవంత్ రెడ్డి ఏవీ కళాశాల నుంచి బీఏ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుగ్గా వ్యవహరించారు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 
 
ఆ తర్వాత 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అనుయాయుడిగా ఎదిగారు. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఫ్లోర్ లీడర్‌గానూ పనిచేశారు.
 
2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రేవంత్‌పై ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో అరెస్టయి, బెయిల్ మీద విడుదలయ్యారు. తదనంతరం 2017 అక్టోబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చురుకుగా వ్యవహరించి.. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అందుకొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవంపోసే ప్రయత్నం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినా.. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఓ పక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆయన దృష్టి పెట్టారు.
 
దీంతో రేవంత్ పనితీరును గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. 2021 జూన్ నెలలో ఆయనను పూర్తిస్థాయి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇదే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని మరోమెట్టు పైకెక్కించింది. ఈ క్రమంలో ఆయనకు సొంత పార్టీలోనే విమర్శలు, పలువురు కీలక నేతల నుంచి సహాయ నిరాకరణను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. రేవంత్‌పై అధిష్ఠానం విశ్వాసం చెక్కుచెదరలేదు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని తానే ముందుండి నడిపించారు. 
 
ప్రచారంలో తనదైనశైలితో అధికార పక్షంపై విరుచుకుపడుతూ.. యువతతోపాటు అన్నివర్గాల ఓటర్లను ఏకతాటిపైకి తెచ్చారు. అటు కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై  పోటీకి దిగారు. తన పాత స్థానం నుంచే మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. సీఎం రేసులో కొనసాగుతున్నారు. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత జైపాల్ రెడ్డి సమీప బంధువు గీతారెడ్డితో 1992లో రేవంత్ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామారెడ్డితో చిత్తుగా ఓడిన కేసీఆర్.. గజ్వేల్‌లో తక్కువ మెజార్టీతో గట్టెక్కారు...