తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్ ప్రచారంలో దూకుడుగా ఉంది. ఇక కేసీఆర్ రోజుకు రెండు, మూడు, వీలైతే నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారు. తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈసారి తెలంగాణలో అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే రాహుల్ గాంధీ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
కాగా, రాహుల్ గాంధీ శనివారం రాత్రి హైదరాబాద్‌లో పర్యటన చేశారు. నగరంలోని ముషీరాబాద్, అశోక్ నగర్‌లో పర్యటించిన రాహుల్ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో చిట్ చాట్ నిర్వహించారు. నిరుద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పేపర్ లీక్ ఘటనలు, నోటిఫికేషన్‌ల నిలిపివేతపై నిరుద్యోగులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగులపై సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అనంతరం చిక్కడపల్లిలోని బావర్చి హోటల్‌లో రాహుల్ నిరుద్యోగులతో కలిసి బిర్యానీ తిన్నారు.