Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారాసకి పేరు దోషం?!!!: 'తెరాస' కాస్త 'భారాస'గా మారడంతో బోల్తా కొట్టిందా?

Advertiesment
BRS
, సోమవారం, 4 డిశెంబరు 2023 (12:06 IST)
కర్టెసి-ట్విట్టర్
తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఘంటాపథంగా భారీ ఫలితాలతో కెవ్వుకేకమనిపించే పార్టీ అది. ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల్లో ఇమిడిపోయిన పార్టీ ఒక్కసారిగా మొన్నటి ఫలితాల్లో కుప్పకూలింది. ఏకంగా గతంలో కంటే 49 స్థానాలను పోగొట్టుకుంది. దీనితో గులాబీ దండు నైరాశ్యంలో మునిగిపోయింది. అసలు ఎందుకు ఇంతగా పార్టీ పరాజయం పాలైందన్న దానికి విశ్లేషకులు తలోరకంగా స్పందిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కి కార్యకర్తలకు చాలా దూరం పెరిగిపోయిందని కొందరంటుంటే... అసలు ఆయన హిట్లర్‌లా మారిపోయారనీ, ఆయన చుట్టూ వున్న కేబినెట్ మంత్రులు సైతం సూర్యుడు చుట్టూ గ్రహాల్లా తిరిగారు తప్ప ప్రజల బాగోగులు మర్చిపోయారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇవి కొందరు చెబుతున్న కారణాలు కాగా... తెరాసకి మరో వాస్తు దోషం వచ్చిపడిందని మరికొందరు జ్యోతిష నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అదేంటంటే... తెరాస.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం. ఆ తర్వాత అది పొట్టిపేరు రూపంలో భారాసగా మారిపోయింది.
 
భారత రాష్ట్ర సమితి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు గాను తెరాస ఇలా భారాసగా మారింది. భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి పార్టీ పేరు 5 అక్టోబర్ 2022న తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు.
 
అక్టోబర్ 6వ తేదీ 2022 నుంచి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 అనుసరించి తెరాస పేరు మార్పు కోసం అవసరమైన సంబంధిత పత్రాలను న్యూఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఆ ప్రకారంగా పేరు మార్చబడటమే కాకుండా అక్టోబర్ 2022 నుండి పార్టీ కార్యకలాపాలు అద్దె భవనం నుండి దేశ రాజధాని ఢిల్లీ నుంచి జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో నవంబర్ 14న న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐతే అప్పటి నుంచి తెరాస పతనం ప్రారంభమైందని అంటున్నారు.
 
తెరాస పేరును అలాగే వుంచినట్లయితే కేసీఆర్ పార్టీకి తిరుగు వుండేది కాదనీ, భారంగా భారాసగా మార్చడంతో తిరోగమనం మొదలైందని అంటున్నారు. ఈ పేరును ఇలాగే వుంచితే భవిష్యత్తులో తెలంగాణలో ఆ పార్టీకి మరింత దారుణమైన ఫలితాలు వస్తాయనీ, ఇక తెలంగాణలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్-భాజపా మధ్యే పోటీ వుంటుందని చెబుతున్నారు. మరి... ఈ వాస్తు లెక్కల ప్రకారం భారాసను తిరిగి తెరాసగా మారుస్తారా.. లేదంటే.. భవిష్యవాణి అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిచౌంగ్ తుఫాను- రెడ్ అలెర్ట్- యువగళం పాదయాత్రకు బ్రేక్