తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోభాగంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులకు చిత్రమైన పరిస్థితి నెలకొంది. తాము పోటీ చేసే స్థానాల్లో ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసే ఈవీఎంలో తమ పేరు ఉన్నా... దానికి ఎదురుగా ఉన్న పార్టీ గుర్తుపై మీట నొక్కలేని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిస్థితి ఇలానే ఉంది. అలాంటి అభ్యర్థులు ఎవరో ఓసారి పరిశీలిద్ధాం.
* సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓటు కుత్బుల్లాపూర్‌లో ఉంది.
* ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన దాసోజు శ్రవణ్‌కు అంబర్‌పేటలో ఓటు ఉంది. ఈయన సైతం తన ఓటును తానే వేసుకోలేని స్థితి.
* కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థిగా అనూహ్యంగా సీటు దక్కించుకున్న నందమూరి వెంకట సుహాసిని నివాసం మాసాబ్‌ట్యాంక్ ఎన్‌ఎండీసీ సమీపంలో ఉంది. ఆమె ఓటు నాంపల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడే భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవరం కాంతారావుకు శేరిలింగంపల్లి ఓటర్ల జాబితాలో ఉన్నారు.
* ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ నివాసం పాతబస్తీ. చార్మినార్‌లో సెగ్మెంట్‌లో ఓటు ఉంది. మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆయన తన ఓటును తానే వేసుకోలేరు.
* రాజేంద్రనగర్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బద్దం బాల్‌రెడ్డికి ఓటు ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో ఉంది. ఈయన క్రితం ఎన్నికల్లో కార్వాన్ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఓటు వేసుకోలేకపోయారు. ఈసారీ కూడా అదే పరిస్థితి.
* నాంపల్లి నుంచి భాజపా పక్షాన పోటీలో ఉన్న దేవర కరుణాకర్‌కు కార్వాన్ స్థానంలో ఓటు ఉంది.
* శేరిలింగంపల్లి నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న జి.యోగానంద్ ఓటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. తెదేపా అభ్యర్థిగా పోటీచేస్తున్న భవ్య ఆనందప్రసాద్ ఓటు సైతం ఖైరతాబాద్‌లోనే నమోదైంది.
* నాంపల్లి ఎంఐఎం అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్ పొరుగున ఉన్న బహదూర్‌పుర నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారు.
* మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఓటు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉంది.
* మల్కాజిగిరి నుంచి మరోసారి బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి ఎన్.రాంచంద్ర రావు ఓటు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉంది.
* యాఖుత్‌పుర నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాషాఖాద్రీ నివాసం బహదూర్‌పుర పరిధిలోకి వస్తుంది.
* సనత్‌నగర్ తెరాస అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కూడా సింకింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలో ఉంది.
* ఉప్పల్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌కు ఓటు ఖైరతాబాద్‌లో ఉంది.