తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. బరిలో ఉండే అభ్యర్థులెవరో గురువారం సాయంత్రానికి తేలిపోనుంది. ఎందుకంటే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకునేందుకు చివరి తేదీ గురువారమే. తుది జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించనుంది.
ఇదిలావుంటే ఎన్నికల ప్రచార వేడి మాత్రం అమాంతం పెరిగిపోతోంది. నిన్నటివరకు టిక్కెట్ కోసం నానా తంటాలు పడిన అభ్యర్థులు ఇపుడు రెబెల్స్‌ను బుజ్జగించడం, క్యాడర్ చేజారిపోకుండా కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. అదేసమయంలో ఓట్ల కోసం స్థానిక గల్లీ లీడర్లు, కార్పొరేటర్లతో రహస్య మంతనాలు జరుపుతున్నారు.
ఇందుకోసం రాత్రివేళల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పగలు ప్రచారానికి పరిమితం కావడంతో తమ సమావేశాలను రాత్రిపూట నిర్వహిస్తున్నారు. రాత్రి వేళ కాలనీల్లోని గల్లీ లీడర్ మొదలుకుని కార్పొరేటర్ వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. ఇందులోభాగంగా బేరసారాలు, బుజ్జగింపులు, ప్రలోభాలకు దిగుతున్నారు.
వాస్తవానికి ఒక అభ్యర్థి బరిలో నిలవాలన్నా, గెలవాలన్నా కార్పొరేటర్లు అత్యంత కీలకం. దాంతో అభ్యర్థికి ప్రత్యర్థిగా ఉండే కార్పొరేటర్లను గుర్తించి వారిని తమవైపునకు తిప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు.