విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంల ఇరు ప్రాంతాల బాగోగులను దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర విభజన చేసినట్టు చెప్పారు. అందుకే విభజన సమయంలోనే నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో ప్రకటించామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ వేదికగా కాంగ్రెస్ - టీడీపీ సారథ్యంలో ఏర్పడిన ప్రజా కూటమి ఆధ్వరంలో జరిగిన భారీ బహిరంగ సభలో తన కుమారుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు బాగుండాలనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో తీర్మానం చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తుందని అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత సోనియా గాంధీ తెలంగాణ గడ్డకు తొలిసారి వచ్చారు. దీంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. సోనియాగాంధీ గతంలో 2014 ఏప్రిల్ 27న చివరిసారి రాష్ట్రానికి వచ్చారు. 2014 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రంగా విభజన కాకముందు ఆమె మూడు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనడం ద్వారా తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లక్ష్యంతో పాటు తెరాస పాలన, మళ్లీ కాంగ్రెస్ రావాల్సిన అవశ్యకతను వివరించారు.
సోనియాగాంధీ 17 నిమిషాలే ప్రసంగించినా అన్ని అంశాలను స్పృశించినట్లు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో గత నాలుగేళ్లుగా ఉన్నది కుటుంబపాలన అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా ఈ అంశాన్ని సోనియాగాంధీ కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐతో కలసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో సోనియాగాంధీ తన ప్రసంగంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు.