తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల ఫీవర్.. ఎవరిని కదిపినా అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది? ముఖ్యమంత్రి ఎవరనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీన్ని అదునుగా చేసుకుని ముంబైలోని కొందరు టాప్ బెట్టింగ్ ఆర్గనైజర్లు రంగంలోకి దిగారు. తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరవుతారన్న అంశంపై బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. అయితే వీరి చర్చ అంతా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అన్నదానిపై తప్ప... ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై కాదని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్‌కు మెజార్టీ వచ్చినా రాకపోయినా కేసీఆరే సీఎం అని బెట్టింగ్ రాయుళ్లు పెద్దమొత్తంలో బెట్టింగ్‌లు కాస్తున్నారట.
ముంబై కేంద్రంగా నడిచే టాప్ బెట్టింగ్ ఆర్గనైజర్లు కేసీఆర్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నా.. టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇక టీఆర్ఎస్‌కు మెజారిటీ వస్తుందని పెట్టిన ప్రతి రూపాయి మీదా 62 పైసలు తిరిగి వస్తుండగా.. టీఆర్ఎస్‌కు మెజారిటీ రాదని పెట్టిన ప్రతి రూపాయి మీదా 64 పైసలు తిరిగి వస్తోంది. ఇప్పటికైతే బెట్టింగ్‌లో పెట్టిన ప్రతి రూపాయి కూడా కేసీఆర్ సీఎం అవుతాడనే పందేలు కాస్తున్నారు. కేసీఆర్ సీఎం అవుతాడని రూపాయి కాస్తే.. తిరిగి రూపాయి వస్తోంది. కేసీఆర్ సీఎం కాలేడని రూపాయి కాస్తే రూపాయిన్నర తిరిగొస్తోంది.
అయితే పబ్లిక్ మూడ్‌ను బట్టి ఈ వ్యాల్యూ ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. ముంబై లోని ఓ బెట్టింగ్ ఆర్గనైజేషన్‌కు చెందిన 300 మంది నిపుణులు.. రాష్ట్రమంతటా తిరుగుతూ పబ్లిక్ మూడ్‌ని ప్రతిరోజూ అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా బెట్టింగ్ జోరుగా నడుస్తోంది.
టీఆర్ఎస్‌కు 45-50 సీట్లు గనుక వస్తే ఎంఐఎం మద్దతిస్తుందని, ఇతరుల మద్దతుతో మెజారిటీ మార్కు సాధిస్తారని ముంబై ఆర్గనైజర్లు అంచనా వేస్తున్నారు. ముంబై ఆర్గనైజర్ల అంచనాలు తరచుగా రుజువవుతున్నాయి.
ఇటీవల కర్నాటక ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసింది. అంతకుముందు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అది కూడా నిజమైంది. అందుకే తమ అంచనాల మీద బెట్టింగ్ రాయుళ్లకు బాగా గురి కుదిరిందని చెబుతున్నారు. విచిత్రంగా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రా ప్రజలే ఎక్కువగా నమ్మకంగా ఉన్నారని వీరి అంచనాలో తేలింది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన బాబుకు ఏపీ ప్రజలు షాక్ ఇచ్చేందుకు రెడీగా వున్నట్లు వారు చెపుతున్నారట. మరి వీరి అంచనా ఏ మేరకు నిజం కాబోతుందో వేచి చూడాలి.