తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పాలుపంచుకున్నారు. ఆయన ఒక్క రోజు సుడిగాలి పర్యటన చేశారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబును పల్లెత్తు మాట అనని నరేంద్ర మోడీ... కాంగ్రెస్, తెరాసలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, కేసీఆర్‌లు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గత యూపీఏ సర్కారులో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారనీ మోడీ గుర్తుచేశారు. అంటే సోనియా గాంధీ వద్ద శిక్షణ తీసుకుని ఆమెకు చెంచాగిరి చేస్తున్నారంటూ ఆరోపించారు.
మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ, కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదని అన్నారు. దేశాన్ని ఓ కుటుంబం దశాబ్దాలుగా కబ్జా చేస్తే... తెలంగాణను ఒక కుటుంబం నాలుగున్నరేళ్లుగా కబ్జా చేసిందని విమర్శించారు. తెలంగాణలో ఈ దుస్థితి రావడానికి కారణమైన కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను ప్రజలు నిలదీయాలని అన్నారు. కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న పాలమూరు ప్రాంతంలో నీరు లేక వలసలు పోతున్నారని... ఈ ప్రాంతాన్ని వలసల ప్రాంతంలా మార్చివేశారని చెప్పారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ లబ్ధి పొందిందని... టీఆర్ఎస్ పార్టీ దాన్ని మించిపోయిందని మండిపడ్డారు.
బీజేపీ హయాంలో ఏర్పడిన రాష్ట్రాలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే... తెలంగాణలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను ఇచ్చిందని చెప్పారు. పాలమూరు అంటే పాలు, నీళ్లు అనే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు.
అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ, ఐదేళ్లూ పరిపాలించమని ప్రజలు అవకాశం ఇస్తే, నాలుగున్నరేళ్లకే కేసీఆర్ తన అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వచ్చారని, ఇది కూడా ఒకందుకు మంచిదేనని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వ పీడను వదిలించుకునే అవకాశాన్ని ప్రభుత్వమే స్వయంగా ప్రజలకు దగ్గర చేసిందని అన్నారు. కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలల ముందే ప్రజలకు అవకాశం వచ్చిందని విమర్శలు గుప్పించారు. త్వరలోనే ప్రజలకు టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కలుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
'నాకు గుర్తుంది. ఈ ప్రాంతంలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వలేకుంటే, మరోసారి ఓటు అడిగేందుకు నేను రానని కొందరు చెప్పారు. వాళ్లు ఓటు అడిగేందుకు వచ్చారా? లేదా? అంటే అబద్ధపు హామీలు ఇచ్చినట్టా? ఇవ్వనట్టా? ఇటువంటి నేతలకు ఓట్లు అడిగే హక్కుందా? వారిని తరిమికొట్టాలా? వద్దా?. కనీసం ప్రజలకు మంచినీరు ఇవ్వలేని పాలకులు ఎందుకు? ఇటువంటి వ్యక్తికి ప్రభుత్వ పగ్గాలు ఎందుకు?" అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారంటే, జ్యోతిష్యం, జాతకాలు, నిమ్మకాయల దండలు, మిరపకాయలపై ఎంతో నమ్ముకున్నారు. దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య భద్రతను కల్పించే ఆరోగ్య పథకాన్ని పేదలకు అందకుండా చేసిన ఘనత ఈయనది. మోడీ పేరున ఉన్న పథకం అమలైతే తనకు నష్టమన్న భావనలో ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. ఆయన అభద్రతా భావంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది అంటూ నిప్పులు చెరిగారు.