టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో రేవంత్ ప్రచారానికి కావాల్సిన హెలికాప్టర్‌ను ఏఐసీసీ ఏర్పాటు చేసింది. కొడంగల్ లోని రేవంత్ నివాసంలో ఓ హెలిప్యాడ్‌కు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయించి తద్వారా లబ్ది పొందాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
రేవంత్ హెలికాప్టర్ ద్వారా ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. నేటి నుంచి డిసెంబర్ 2 వరకు 28 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఎన్నికల ప్రచారాన్ని హెలికాప్టర్ ద్వారా సుమారుగా 30 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేసీఆర్‌లు ఇప్పటికే హెలికాప్టర్‌లను వినియోగిస్తున్నారు. తాజాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన ప్రచారానికి హెలికాప్టర్‌ను వినియోగించబోతున్నాడు. దీనిపై రేవంత్ రెడ్డి అభిమానులు తమ నేతకు అరుదైన గౌరవం దక్కిందని సంబరపడుతున్నారు.