పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో.. ప్రచారంలో భాగంగా ఆదివారం మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు విశ్రాంతి తీసుకున్న పవన్.. తాటి చాపపై కూర్చుని మట్టి ముంతలో జొన్న అన్నం తిని, కాసేపు సేద తీరారు.
పంచెకట్టులో వేపచెట్టు కింద కూర్చుని జొన్న అన్నం తింటున్న పవన్ వీడియో, ఫొటోలను జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ సింప్లిసిటీకి ఇది నిలువెత్తు నిదర్శనమంటూ ఆయన అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.
మరోవైపు మిత్రపక్షం సీపీఐకి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరో షాకిచ్చారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ తన అభ్యర్థిగా ముప్పాళ్ల నాగేశ్వరరావును ప్రకటించింది. ఈ క్రమంలో, జనసేన అభ్యర్థిగా చల్లపల్లి శ్రీనివాస్ పేరును పవన్ తెరపైకి తీసుకువచ్చారు. దీంతో షాక్‌కు గురైన ఎర్రదండు పవన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.