తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో ఆ రాష్ట్ర తాజా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (టి.హరీష్ రావు) ఒకరు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో అత్యంత కీలక శాఖలను నిర్వహించిన నేత. తెరాసకు వెన్నెముక. ప్రస్తుతం ఈయన సిద్ధిపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా ఉన్న హరీష్ రావుకు ఈ దఫా కూడా గెలుపు నల్లేరుపై నడకే. కానీ, ఆయన సాధించే మెజార్టీపైనే ఇపుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. హరీష్ రావు బామ్మర్ధి మాజీ మంత్రి కేటీఆర్.. ఈ దఫా తన బావకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని, వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో రాజు అనే టీ దుకాణం యజమాని కూడా తనవంతు కృషి చేస్తున్నాడు. తన్నీరుపై ఉన్న అభిమానంతో తేనీరు ఉచితంగా ఇస్తున్నాడు. హరీష్ రావుకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని ఆకాంక్షిస్తూ సిద్ధిపేట పట్టణంలో రైతు బజారు సమీపంలోని తన టీ దుకాణం వద్ద అక్టోబరు 7వ తేదీ నుంచి ఉదయం 7 - 9 గంటల మధ్య ఉచితంగా తేనీరు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత రూ.7కు విక్రయించే తేనీరును రాయితీ ధరపై రూ.4కే విక్రయిస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు సుమారుగా 23500 మందికి ఉచితంగా టీ అందించారు. పోలింగ్ జరిగే రోజు వరకు ఇదే విధంగా విక్రయిస్తానని రాజు చెబుతున్నాడు.