Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెసిఆర్‌కు చంద్రబాబు ధీటైన జవాబు ఇచ్చారట.. ఎలా?

Advertiesment
Chandrababu Naidu
, గురువారం, 29 నవంబరు 2018 (18:18 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏఐసిపి అధ్యక్షులు రాహూల్‌ గాంధీతో కలిసి ఎన్నికల్లో సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడు… ఏమి మాట్లాడుతారో, కెసిఆర్‌ చేస్తున్న ఆరోపణలకు ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
 
తెలంగాణ సభల్లో చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యంగా మాట్లాడారు. కాస్త ఆత్మరక్షణ ధోరణి, ఇంకాస్త ఎదురుదాడి వ్యూహాన్ని అనుసరించారు. అదేవిధంగా కాంగ్రెస్‌-టిడిపి పొత్తును జనం ఏమేరకు ఆమోదించారో ఈ సభల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అన్నింటికీ మించి తెలంగాణకు జైకొట్టి… తను తెలంగాణ వ్యతిరేకిని కాదనే నమ్మకాన్ని జనంలో కలిగించే ప్రయత్నం చేశారు.
 
గత కొన్ని రోజులుగా టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌… కాంగ్రెస్‌ పార్టీ కంటే తెలుగుదేశంపైనే ఎక్కువ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహాకూటమి ముసుగులో చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణపై పెత్తనం చేయడానికి చూస్తున్నారని ప్రతి సభలోనూ కెసిఆర్‌ చెబుతున్నారు. తెలంగాణ నీటి ప్రాజెక్టును అడ్డుకోడానికి 30కి పైగా లేఖలను రాసిన చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్‌ ఎలా జతకట్టిందని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ను తానే కట్టించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, చంద్రబాబు ఒక మెంటల్‌ కేసు అంటూ అవహేళన చేశారు కూడా.
 
కెసిఆర్‌పై ప్రతిదాడికి దిగకుండా… నెమ్మదిగానే సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. హైదరాబాద్‌ను తాను కట్టించానని చెప్పడం లేదని… తాను సైబరాబాద్‌ను సృష్టించానని చెప్పుకొచ్చారు. ఇంకా తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించే ప్రయత్నం చేశారు.
 
తాను కెసిఆర్‌లా దూషణలకు దిగబోనని, కెసిఆర్‌ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పడం ద్వారా… తాను హుందాగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులను అడ్డుకోడానికి లేఖలు చేసినట్లు కెసిఆర్‌ చేసిన ఆరోపణలు వివరణ ఇవ్వకుండా… తెలివిగా మాట్లాడారు. దిగువన ఉన్న తాము ప్రాజెక్టులను ఎలా అడ్డుకోగలమని మాత్రమే చెప్పి ఆ అంశాన్ని వదిలేశారు.
 
ఇక కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకూ అన్యాయం చేస్తోందని, అయినా కెసిఆర్‌ అడగడం లేదని చెబుతూ…. కెసిఆర్‌కు ఓటు వేస్తే అది నరేంద్ర మోడీకి వేసినట్లేనని చెప్పారు. ఉపన్యాసం ముగింపులో జై తెలంగాణ అనడం ద్వారా తాను పూర్తిగా తెలంగాణ ప్రజల బాగును కోరుకుంటున్నానని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
 
కాంగ్రెస్‌-తెలుగుదేశం కలయికను కార్యకర్తలు ఏ మేరకు ఆమోదిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నమూ జరిగింది. ప్రజా కూటమిని అభ్యర్థులను గెలిపిస్తారా… అని పదేపదే అడగడం ద్వారా జనం స్పందనను తెలుసుకోడానికి చంద్రబాబు ప్రయత్నించారు. మొత్తంమ్మీద చంద్రబాబు చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుస్తుందా గెలవదా అనే సంగతి పక్కనపెడితే… తెలంగాణలో తమ పార్టీకి ఇప్పటికీ భవిష్యత్తు ఉందనే విశ్వాసం బాబులో ఉన్నట్లు భావిస్తున్నారు విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైద‌రాబాద్‌లో దేవ‌తలున్నారు దేవుళ్లున్నారు... సంచలన గాయని బేబీ