ప్రతిభను పరిశ్రమ గుర్తిస్తుంది. గౌరవించి అవకాశాలిస్తుంది.. కాస్త ఆలస్యంగా అయినా వెలుగులోకి వచ్చిన గాయనీమణి బేబి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్. మెగాస్టార్ చిరంజీవి అంతటివారే బేబి పాటకు ఫిదా అయిపోయారు. ఆమె పాటను విని సతీ(సురేఖ)సమేతంగా పరవశించిపోయారు. ప్రత్యేకించి తనను ఇంటికి పిలిపించి మరీ సన్మానించారు. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ అంతటి వారే ఆమె పాటకు ఖుదాఫీస్ అన్నారు. తనకు పాడేందుకు అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు.
వందల చిత్రాలకు సంగీతం అందించిన టాలీవుడ్ సంగీత దర్శకుడు కోటి తాను సంగీతం అందించే ప్రతి సినిమాలో అవకాశాలిచ్చి ప్రోత్సహించేందుకు సిద్ధపడ్డారు. ఒకరేమిటి.. బేబి పాడతానంటే సంగీత దర్శకుల క్యూ రెడీగా ఉందిప్పుడు.
`ఓ చెలియా నా ప్రియ సఖియా.. అంటూ గొంతు సవరించింది మొదలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెలబ్రిటీ అయిపోయారు బేబి. మట్టిలో మాణిక్యం... పల్లెకోకిల అంటూ బేబీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. బేబి ప్రకంపనాలు ఇప్పట్లో ఆగేట్టు లేవు. ఓవైపు రాజకీయ నాయకులు, మరోవైపు సినీసెలబ్రిటీలు బేబీని కలుస్తున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా మాజీ శాసన సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త టి.వెంకట్రావ్ బేబీని సన్మానించారు. రూ.1,11,111 విరాళం ఇచ్చి .. చీరలు అందజేశారు. ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో కోటి, గాయని గీతామాధురి, కేథరిన్ థ్రెసా, హీరోయిన్ కారుణ్య (బంగారి బాలరాజు), నటి రంజిత, సింగర్ మధు తదితరులు పాల్గొన్నారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ- ``వాట్సాప్‌లో పాట విని షాకయ్యాను. బేబీకి పుట్టుకతో వచ్చిన ప్రతిభ అది. ఇది ఇన్‌బిల్ట్ ట్యాలెంట్. కీర్తి అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. చిరంజీవి - సురేఖ గారు తన పాట వినాలని ఫోన్ చేస్తే వెంటనే తనని వాళ్ల దగ్గరికి తీసుకెళ్లాను. చిరంజీవి గారు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. పాటలు పాడించుకుని విన్నారు. ఏ.ఆర్.రెహమాన్, బాలసుబ్రమణ్యం, జానకమ్మ అందరూ పిలిచి బేబీని ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. బేబి ఏ పాట పాడినా ఆకట్టుకుంటోంది. 5 డిసెంబర్ తర్వాత రెహమాన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రఘు కుంచె తొలి పాటను పాడించాడు. బేబి అద్భుతంగా పాడారు. రఘు మ్యూజిక్ బాగా కుదిరింది.
రెండో పాటకు నాకు అవకాశమిచ్చారు బేబి. నాకు ఫోక్ మెలోడీ పాటను పాడబోతున్నారు. పరిశ్రమ సంగీత దర్శకులంతా తనతో పాడించుకోవాలి. చదువు లేదు. కేవలం సంగీతం మాత్రమే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను కొన్ని మెళకువలు చెబుతున్నా. బేబికి అమెరికా, దుబాయ్ నుంచి పిలుపొచ్చింది. అక్కడ లైవ్ ఈవెంట్లు చేయబోతోంది. ఎవరైనా తనకు ప్రోత్సాహకంగా ఎలాంటి సాయం చేయాలనుకుంటే చేయొచ్చు`` అని అన్నారు.
మాజీ టి.ఎమ్మెల్యే వెంకట్రావ్ మాట్లాడుతూ - గొప్ప సంగీత దర్శకులు.. యువతరాన్ని ఉర్రూతలూగించి.. ఎందరో పెద్ద స్టార్లకు గొప్ప హిట్ సంగీతం ఇచ్చిన సంగీత దర్శకులు కోటి. బయటి ప్రపంచానికి తెలియని నిగూఢంగా దాగి ఉన్న బేబిలోని ట్యాలెంటును గుర్తించి సభ్యసమాజానికి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రతిభను గుర్తించి బయటకు చూపాలంటే వ్యయప్రయాసలకోర్చాలి. తనని ఒక గొప్ప గాయనిగా తీర్చిదిద్దేందుకు కోటి చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. అందరూ తనని ప్రోత్సహిస్తున్నారు. కారుణ్య వంటి నవతరం ఎదగాలని కోరుకుంటున్నా. కోటి మరింతగా ఇలాంటి మంచి పనులుతో అందరూ గర్వించేలా చేయాలని కోరుతున్నా.
బేబి మాట్లాడుతూ -``పాడతానని .. ఆ పాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు. నేను బట్టలు ఉతికాక .. పక్కింటికి వెళ్లాను. అక్కడ ఆ అమ్మాయి పాడుతుంటే వీడియో తీసి వైరల్ చేసింది. అనుకోకుండా అవలీలగా ఆ పాటను అందరికీ చూపించింది. మా పాపకు బాబు పుట్టాడు. ఆస్పత్రిలో ఉన్నాను. ఈ పాట వాట్సాప్‌లో వైరల్‌గా మారింది... నీకు తెలుసా? అని అన్నారు. మీ అందరి సాయంతోనే నేను హైదరాబాద్‌కి వచ్చాను. కోటి సర్ బోల్ బేబి బోల్‌లో పాట పాడమని అన్నారు. సర్ ప్రోత్సహిస్తున్నారంటే అది అందరి దయ. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంత ఆదరించి నన్ను మీలో ఒకరిని చేసుకున్నారు. హైదరాబాద్ అంటే భయంభయం.. పట్నంలో మంచిగా ఉండరు. లెక్క చేయని స్థితిలో ఉంటారు అని భయపెట్టారు. కానీ ఇక్కడ అందరూ నాకు దేవుళ్లు దేవతల్లా కనిపిస్తున్నారు. ఇది నిజం.
ఈ పయనం భయంగానే సాగింది. నేను పుట్టాక .. రంగంపేట, రాజమండ్రి తప్ప ఎక్కడికీ వెళ్లలేదు. కోటి సార్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. భయపడొద్దని పాట గురించి అవగాహన కల్పించి .. సంగీతంలో శిక్షణ ఇచ్చారు. తండ్రి, దేవుడు, అన్న అన్నీ తనే. ఈ పాటను వదిలిపెట్టను. పాడతానో లేదో తెలీదు కానీ ప్రయత్నిస్తాను. సార్ .. నడిపించిన బాటలో నడుస్తాను. లేదంటే మా ఊరు వెళ్లిపోతాను. మీ అందరి దీవెనలు కావాలి. వెంకట్రావు గారు విరాళం ఇచ్చి కళను ఇంతగా ప్రేమించడం ఆశ్చర్యం కలిగించింది. మట్టిలో పుట్టి పెరిగాను. కూలి పని చేసుకునేదానిని. అన్ని పనులు చేశాను. ఇక్కడికి వచ్చాను. మీ అందరి ఆదరాభిమానులతోనూ ఇలా రాగలిగాను. `మిర్రర్స్` కంపెనీ లక్ష్మి గారు.. పట్టు చీరలు ఇచ్చి రూ.30 వేలు విరాళం ఇచ్చారు. నా జుత్తు రింగుల జుత్తు.. ఇది నాది కాదు.. నన్ను మార్చేశారిలా.. కార్ ఇచ్చి ప్రయాణాలకు సాయం చేశారు. హైదరాబాద్‌లో దేవతలున్నారు దేవుళ్లున్నారు అని అన్నారు.