పిల్లలకు స్వీట్ అంటే చాలా ఇష్టం. నిత్యం షాపులో కొని తేవడం కంటే కొన్ని సార్లు ఇంట్లోనే చేస్తేనే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. కొబ్బరి ఆరోగ్యానిక చాలా మంచిది. అంతేకాకుండా కొబ్బరి రవ్వ బర్ఫీలాంటివి చేయడం చాలా సులువు... అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
గోధుమ రవ్వ - పావుకిలో, పంచదార - అరకిలో, పచ్చి కొబ్బరి - అర చెక్క, నెయ్యి - పావుకిలో, జీడిపప్పు - గుప్పెడు, యాలకుల పొడి - ఒక టీ స్పూను
తయారుచేసే విధానం...
కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి తురుములా చేసుకోవాలి. దానిని కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పును కూడా తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో గోధుమ రవ్వని వేసి వేయించాలి. కాస్త బ్రౌన్ రంగులోకి మారేవరకు ఉంచి తీసేయాలి.
ఇప్పుడు మరో గిన్నె స్టవ్ మీద పెట్టి పంచదార నీళ్లు కలిపి వేడిచేయాలి. పాకం సాగేలా వచ్చినప్పుడు అందులో వేయించిన గోధుమరవ్వ, కొబ్బరి తురుము జీడిపప్పు వేసి బాగా కలపాలి. కాస్త నెయ్యి కూడా వేస్తూ... కలుపుతూ ఉండాలి. మిశ్రమం కాస్త దగ్గరగా అవుతున్న సమయంలో స్టవ్ కట్టేయాలి. చల్లారిపోకముందు కళాయిలోంచి పెద్ద ప్లేటులో దానిని ఒంపుకోవాలి. చల్లారాక దానికి నచ్చిన ఆకృతుల్లో కోసుకోవచ్చు. ఇవి పదిరోజుల పాటు తాజాగా నిలవఉంటాయి.