శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, అర్థరాత్రి కారాగారంలో దేవకీ వసుదేవుల దంపతులకు శ్రీమన్నారాయణుడు కన్నబిడ్డగా పుట్టాడు. దేవకీ వసుదేవుల హృదయంలో అవధులు లేని అనందసాగరం, ఆ జగన్నాట సూత్రదారే తమకు పుత్రునిగా జన్మించినందుకు తమ జన్మ సార్థకమైందని అమిత ఆనందం పొందుతారు.
బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్ళల్లోకి తన స్నేహితులతో వెళ్లి తనకిష్టమైన పాలు, పెరుగు, వెన్న దొంగిలించేవాడు. తను తిని అందరికీ పెట్టేవాడు. ఆ కృష్ణపరమాత్మ తన స్నేహితులను నేలమీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న, పెరుగులకోసం ఉట్టీలను అందుకొనేవాడు.
ఆ కృష్ణలీలను గుర్తుచేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టీలు కొట్టడం. శ్రీకృష్ణాష్టమినాడు జనులు తమ ఇళ్ళను శుభ్రపరచి, తోరణాలతో అలంకరించడమేకాక ఇంటి ముంగిళ్ళలో బాలకృష్ణుని పాదముద్రలను వేస్తారు.
మరునాడు జనులు ఉట్లను కొట్టి ఆనందిస్తారు. బృందావనంలో రాధాకృష్ణుల రాసలీలలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. పదహారు వేలమంది గోపికలతో, రాధతో యమున ఒడ్డున బాలకృష్ణుడు రాసలీల జరిపి గోపికలను ఆనందపరవశులను చేయడం, ఆత్మ - పరమాత్మల సమ్మేళనలోని అంతరార్థాన్ని తెలియచేసేందుకై ఆయన ఈ బృందావనాన్ని రంగస్థలంగా చేసుకొన్నాడు.
రాసక్రీడను నిమిత్తమాత్రంగా చేసుకుని, గోపికల్లోని శారీరక మోహావేశాన్ని, ఈర్ష్యాసూయల్ని గోపాలుడు నావాడే అన్న స్వార్థాన్ని, అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన పరతత్వంలో మమేకం కావడం అంటే ఏమిటో తెలియజేయడమే ఈ రాసలీలల్లోని అంతరార్థం.