రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా హైదరాబాదీ ప్లేయర్, వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు సోమవారం పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వరించింది.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమె ఆ అవార్డును స్వీకరించారు. ఒలింపిక్ ప్లేయర్ పుసర్ల వెంకట సింధు రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకున్నది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
అలాగే, ఎయిర్ మార్షల్ డాక్టర్ పద్మ భందోపాధ్యాయ వైద్య రంగంలో పద్మశ్రీ అవార్డును గెలిచారు. రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం 119 పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంట్లో ఏడు పద్మ విభూషణ్, పది పద్మభూషణ్, 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డులు అందుకున్నవారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరో 16 మందికి మరణానంతరం అవార్డులను ఇచ్చారు.