భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేశారు. టెన్నిస్ ఆడేందుకు శరీరం సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. పైగా, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ సీజన్ చివరిదన్న సంకేతాలను ఆమె వెల్లడించారు. ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో కలిసి ఈ టోర్నీలో పాల్గొంది. అయితే, తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.
ఆ తర్వాత ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించారు. "ఒకే.. నేను ఇకపై ఆడబోవడం లేదు" అని సింపుల్‌గా చెప్పలేనని చెప్పారు. టెన్నిస్ ఆడటం కోసం తన మూడేళ్ళ కుమారుడితో కలిసి తాను సుధీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, చిన్నారిని ఇబ్బంది పెట్టలేనని సోనియా చెప్పుకొచ్చారు.
పైగా, తన శరీరం కూడా ఇంతకుముందులా సహకరించడం లేదని చెప్పారు. ఈ రోజున తన మోకాలు చాలా ఇబ్బంది పెట్టిందని అయితే, ఈనాటి ఓటమికి ఇదే కారణమని తాను చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ సీజన్ చివరివరకు ఆడాలని భావిస్తున్నానని, ఆ తర్వాత ఆటలో కొనసాగడం అసాధ్యమని సానియా స్పష్టం చేశారు.