Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024 మనుబాకర్

Advertiesment
manu bhaker

ఠాగూర్

, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (10:10 IST)
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్‌ గెలుచుకున్నారు. ప్రజలు తమ అభిమాన క్రీడాకారిణికి ఓట్లేసి గెలిపించడంతో ఆమెను ఈ అవార్డు వరించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా మనుభాకర్ రికార్డు నెలకొల్పారు.
 
బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 2004 నుంచి 2022 వరకు భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీరాజ్‌ అందుకున్నారు. బీబీసీ చేంజ్ మేకర్ 2024 అవార్డును చెస్ ప్లేయర్ తానియా సచ్‌దేవ్, ఖొఖో ప్లేయర్ నస్రీన్ షేక్, బీబీసీ స్టార్ పెర్‌ఫార్మర్ 2024 అవార్డు అథ్లెట్ ప్రీతిపాల్, తులసిమతి మురుగేశన్ దక్కించుకున్నారు.
 
భారత్ తరపున పారాలింపిక్స్‌లో మెడల్ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచిన 18 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు'ను గెలుచుకున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆప్ ద ఇయర్ 2024 అవార్డుకు గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖరా, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌లు నామినీలుగా ఎంపికయ్యారు.
 
ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు, రచయితలు, నిపుణులతో కూడిన జ్యూరీ ప్యానల్ 2025 జనవరిలో ఐదుగురు ప్లేయర్లను నామినీలుగా ఎంపిక చేసింది. ఆ తరువాత ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయించడానికి ఆడియన్స్‌కు అవకాశాన్నిచ్చారు. రెండు వారాలపాటు సాగిన ఈ ఓటింగ్‌లో అభిమానులు తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేశారు.
 
2024లో భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఈ అవార్డును బీబీసీ అందిస్తోంది. దేశంలో మహిళలు క్రీడల్లో సాధించిన విజయాలను ఇది గౌరవిస్తుంది. ప్లేయర్లు చాంపియన్లుగా ఎదగడంలో వెన్నంటి నిలిచిన వ్యక్తులు, వారు అందించిన సహకారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో 'చాంపియన్స్ చాంపియన్' అనే థీమ్‌తో ఈ ఏడాది ఎడిషన్‌ను నిర్వహించారు.
webdunia
 
కాగా, బీబీసీ ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ఆమె తన సందేశాన్ని పంపించారు. క్రీడలలో మహిళల విజయాలను హైలైట్ చేయడానికి బీబీసీ తన నిబద్ధతను చాటుతోందని రాష్ట్రపతి తన లేఖలో పేర్కొన్నారు.
 
గత ఎడిషన్ల విజేతలు వీరే..
భారత్‌లోని మహిళా అథ్లెట్లు సాధించిన విజయాలను వేడుకగా చేయడంతోపాటు వారికి తగిన గౌరవం ఇవ్వాలనే లక్ష్యంతో 2019లో ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ మొదలైంది. జ్యూరీ ఎంపిక చేసిన మరో ముగ్గురు క్రీడాకారిణులను కూడా బీబీసీ సోమవారం జరిగే కార్యక్రమంలో సత్కరించనుంది. 
 
యువ అథ్లెట్ సాధించిన విజయాలకు ప్రతీకగా 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు, క్రీడల్లో అనుభవజ్ఞులైన క్రీడాకారిణులు చేసిన అసమాన కృషికి గుర్తుగా 'బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డు, పారా స్పోర్ట్స్‌లో చూపిన ప్రతిభను చాటిచెప్పేందుకు 'బీబీసీ పారా స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను బీబీసీ అందించనుంది. ఈ అవార్డు కార్యక్రమాన్ని బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
 
ఈ అవార్డుల మొదటి ఎడిషన్‌(2019)కు అప్పటి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఏడాది బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు 'బీబీసీ ఇండియన్ సోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను గెలుచుకున్నారు. 2020 ఎడిషన్‌లో వరల్డ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి విజేతగా నిలిచారు. 2021, 2022లో వరుసగా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' గెలుచుకున్నారు. గత ఎడిషన్స్‌లో క్రికెటర్ షెఫాలీ వర్మ, షూటర్ మను భాకర్ 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను కైవసం చేసుకున్నారు.
 
అథ్లెట్లు పీటీ ఉష, అంజు బాబీ జార్జ్, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, హాకీ ప్లేయర్ ప్రీతమ్ శివాచ్‌ 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు' గెలుచుకున్నారు. 'డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్‌'కు ప్రాధాన్యమిస్తూ గతేడాది 2023 ఎడిషన్‌లో 'బీబీసీ ఇండియన్ పారా-స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా ప్రవేశపెట్టాం. భారత టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ ఇందులో విజేతగా నిలిచారు.
 
సేకరణ.. బీబీసీ కథనం 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల - లీగ్ ఎప్పటి నుంచి అంటే...