Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆవేశంలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునివుంటారు.. కూర్చోబెట్టి వినేశ్‌తో మాట్లాడుతాం.. మహావీర్ ఫొగాట్

vinesh phogat

ఠాగూర్

, గురువారం, 8 ఆగస్టు 2024 (13:37 IST)
పారిస్ ఒలింపిక్ పోటీల్లో భాగంగా, 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ కేటగిరీలో అంతిమ పోరు చివరి నిమిషంలో కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురయ్యానన్న బాధతో పాటు ఆవేశంలో తన కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్టు రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నిర్ణయం తీసుకునివుంటారని ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ అభిప్రాయపడ్డారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతామన్నారు. వినేశ్ స్వదేశానికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడుతామని చెప్పారు. ఆమెను కలిసి మాట్లాడుతాం. ఆమెకు సర్దిచెప్పి నిర్ణయం మార్చుకునేలా చేస్తామన్నారు. పారిస్ ఒలిపింక్స్ పోటీల్లో అనర్హత వేటు పడటంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అభిప్రాయపడ్డారు. 
 
ఆమె ఈ విషయాన్ని గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రకటించారు. ఒలింపిక్స్ ఫైనల్ దగ్గరకు వచ్చి పతకాన్ని కోల్పోవడంతో ఆమె ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నారు. ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుతామన్నారు. విజయానికి ఇంత దగ్గరగా వచ్చి, ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు ఎవరైనా ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజమన్నారు. 
 
'కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను...' - వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం 
 
భారత రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. "కుస్తీ నాపై గెలిచింది.... నేను ఓడిపోయాను.. నన్ను క్షమించు... మీ కల.. నా ధైర్య విచ్ఛిన్నమైంది. ఇక నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను" అంటూ ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది.
 
అద్వితీయ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్‌కు చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగాట్ దేశానికి మరో పతకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదువార్త వినాల్సి వచ్చింది.
 
ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేశ్ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్'ను ఆశ్రయించింది. తాను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లమంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత హీనంగా చూశారు : శార్దూల్ ఠాకూర్