ఆఫ్రికా దేశాల్లో ఒకటైన గినియాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసాయి. పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెరె నగరంలో ఓ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులోభాగంగా ఆదివారం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది.
వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కొందరు పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై స్థానిక ఆసుపత్రి డాక్టర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 100 మంది మృతిచెందారని వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా అవకాశం ఉంది.