టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత్‌కు మరో పతకం వచ్చింది. భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్యం సాధించాడు. శనివారం మధ్యాహ్నం కాంస్యం కోసం జరిగిన పోరులో భజరంగ్ 8-0తో కజకిస్థాన్‌కు చెందిన దౌలత్ నియాజ్ బెకోవ్‌ను చిత్తు చేశాడు.
పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరులో భజరంగ్ పునియా తన స్థాయికి తగిన ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో ఓటమి అనంతరం కుంగిపోకుండా, ఈ మ్యాచ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి భారత్ ఖాతాలో ఆరో పతకాన్ని చేర్చాడు. భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా 2 రజతాలు, 4 కాంస్యాలు లభించాయి.
భజరంగ్ పతక సాధనపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టోక్యో నుంచి సంతోషకరమైన వార్త అందిందని తెలిపారు. భజరంగ్ కళ్లు చెదిరే పోరాటం కనబర్చాడని కితాబునిచ్చారు. "ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసే విజయం సాధించినందుకు నీకు శుభాభినందనలు" అంటూ భజరంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
కాగా, పునియా విజయంతో భారత శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి. ఈ గెలుపుపై భజరంగ్ పునియా తండ్రి బల్వాన్ సింగ్ స్పందిస్తూ తన కలను కుమారుడు నిజం చేశాడని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కాంస్య పతకం తనకు స్వర్ణ పతకంతో సమానమని ఆయన పేర్కొన్నారు.