ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం తేరుకోలోని షాకిచ్చింది. ఆయన ఎంట్రీ వీసాను రద్దు చేసింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లోభాగంగా, కరోనా వ్యాక్సినేషన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్బంధం చేసింది. అలాగే, కరోనా టీకాలు వేసుకున్నవారు మాత్రమే దేశంలోకి అనుమతిస్తూ వస్తుంది. ఈ క్రమంలో టెన్నిస్ టోర్నీ కోసం మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టిన జొకోవిచ్‌కు ఊహించని షాకిచ్చింది.
కరోనా టీకాలు వేయించుకోకపోవడంతో ఎంట్రీ వీసాను రద్దు చేసింది. దీంతో ఆయన దాదాపు ఎనిమిది గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సివచ్చింది. నిజానికి ఆస్ట్రేలియన్ టెన్నిస్ టోర్నీ కోసం జొకోవిచ్ అక్కడకు వచ్చి, వైద్యపరమైన మినహాయింపులతో ఈ టోర్నీలో పాల్గొనాలని భావించారు.
కానీ, విమానాశ్రయ అధికారులు మాత్రం ఆయనకు చుక్కలు చూపించారు. వీసా దరఖాస్తు విషయంలో పొరపాట్లతో పాటు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ ఆయన్ను దేశంలోకి అనుమతిచ్చేందుకు నిరాకరించింది.
కాగా, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జొకోవిచ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఆయన తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచారు. ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ అటగాడికి విమానాశ్రయంలో ఎదురైన అనుభవంలో సెర్బియా ప్రధాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.