సంక్రాంతి పండుగ అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ సంక్రాంతి పండుగ. ఈ పండుగ వేళ తెలుగు లోగిళ్లలో గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, రంగు రంగుల పతంగుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందేలు.. ఇలా పల్లె వాకిట పరమానందం నింపే పర్వదినం సంక్రాంతి. ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు.. దీనిని మకర సంక్రమణం అంటారు.
ఈ మకర సంక్రమణం (జనవరి 15, 2026) రోజున నువ్వులనూనెలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. అంతేకాకుండా పండుగ రోజు తలకు నూనె రాసుకుని శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నది బలమైన విశ్వాసం. తెలుగు సంప్రదాయంలో ముగ్గును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాగే గొబ్బెమ్మలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని కూడా ప్రగాఢ విశ్వాసం.
ధనుర్మాసం అంతా శ్రీమహావిష్ణువును ఆరాధించే కాలమని, ఆ ధనుర్మాసం మకర సంక్రాంతి రోజుతో ముగుస్తుందని వివరించారు. అందుకే సంక్రాంతి నాడు శ్రీమహావిష్ణు ఆరాధనతో పాటు పితృదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం మంచిది. ఈ ఏడాది సంక్రాంతి గురువారంతో కలసి రావడం విశేషం.
సంక్రాంతి రోజున వేకుజామున 2 గంటల నుంచి వస్త్రదానం, ఉదయం 4 గంటల నుంచి పసుపులు పూసుకోవడం, 11:30 లోపు పిండప్రదానం, మధ్యాహ్నం 12 గంటల్లోపు దేవతా పూజలను పూర్తి చేసుకోవాలి.