Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

69వ గణతంత్ర వేడుకలకు భారత్...

2018, జనవరి 26న భారతదేశం 69వ గణతంత్ర వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి ఆగస్

69వ గణతంత్ర వేడుకలకు భారత్...
, శుక్రవారం, 19 జనవరి 2018 (13:52 IST)
2018, జనవరి 26న భారతదేశం 69వ గణతంత్ర వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.
 
అలా.. 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.
 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలాకాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.
 
1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
 
ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలుజరిపారు. ఆనాటి నుంచి భారతదేశము "సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర" రాజ్యంగా అవతరించబడింది. అప్పటినుంచి ఈరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనదేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 
 
ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులకు పతకాలను అందజేస్తారు. అదే విధంగా ఈ రోజును పురస్కరించుకుని దేశ రాజధానిలోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ గొప్ప గొప్ప పెరేడ్‌లను నిర్వహిస్తారు. అనేక పాఠశాలల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ పెరేడ్‌లలో పాల్గొంటారు.
 
దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా.. ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ, ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి ఒక్క పాఠశాలలోనూ జనవరి 26ను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మిమ్మల్ని షో దగ్గర కలుస్తా': గాయని... కారులో ఎక్కించుకుని పంట పొలాల్లో...