Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అపచారం.. అపచారం.. దుర్గ సన్నిధిలో అన్యమతస్తులు

అపచారం.. అపచారం.. దుర్గ సన్నిధిలో అన్యమతస్తులు
, గురువారం, 5 డిశెంబరు 2019 (15:07 IST)
దుర్గమ్మ సన్నిధిలో సుమారు 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఐదు శాతం మంది అన్యమతస్థులేనని అంచనా. దీంతో ఉద్యోగుల నుంచి డిక్లరేషన్‌ తీసుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. అన్యమత ప్రచారం తిరుమలలో తరచూ వివాదాలకు దారితీస్తోంది. ఇది రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రికీ విస్తరిస్తుంది. కోట్లాది మంది హిందువుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా కొండపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలోనూ అన్యమతస్థులున్నారు. ఈ ప్రశ్నలకు అధికార వర్గాల నుంచే అవుననే సమాధానమే లభిస్తోంది.
 
అమ్మవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. వారంతా ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా తగిన సేవలందించేందుకు దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దాదాపు 900 మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో దాదాపు ఐదు శాతం మంది అన్యమతస్థులు ఉండొచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
 
హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించకూడదనే నిబంధన ఉన్నా రాష్ట్రంలోని టీటీడీతో సహా ప్రముఖ దేవాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులలో అన్యమతస్థులున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు నెలలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్రంలోని దేవదాయ శాఖ ఉద్యోగులందరి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని ఆదేశించారు.

హిందూ దేవాలయాల్లో పని చేసే ఉద్యోగులు స్వామివారు లేదా అమ్మవారి పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నామంటూ బహిరంగ ప్రమాణం చేయడం లేదా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడాన్నే డిక్లరేషన్‌ అంటారు. ఆ కార్యక్రమాన్ని చేపట్టకుండానే ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయిపోయారు. ఆయన బదిలీకి ఈ డిక్లరేషన్‌ ఉత్తర్వులు కూడా కారణమేనంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరుల దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లోనూ అన్యమతస్థులున్నారన్న వాదన తెరమీదకు వచ్చింది. ఈ దేవస్థానంలో ఇంతకు ముందెప్పుడో ఒకసారి ఉద్యోగుల నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు. అప్పట్లో సూపరింటెండెంట్‌గా పనిచేసే ఒక ఉద్యోగి అన్యమత విశ్వాసాలు కలిగి ఉండటం వల్ల డిక్లరేషన్‌ ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో అతనిని దేవస్థానం అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. 
 
ఆ ఉద్యోగి మాదిరిగానే మరికొందరు అన్యమతస్థులున్నప్పటికీ.. ఉద్యోగం పోతుందన్న భయంతో అప్పట్లో డిక్లరేషన్‌ ఇచ్చేశారని, కానీ వారి మత విశ్వాసాలు ఇప్పటికీ వేరుగానే ఉన్నాయన్న వాదన కొండపై వినిపిస్తోంది. 
 
ప్రస్తుతం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో 150 మంది అర్చకులు.  170 మంది రెగ్యులర్‌ సిబ్బంది. 197 పారిశుద్ధ్య సిబ్బంది. 170 మంది భద్రతా సిబ్బంది. 20 మంది హోంగార్డులు. 13 మంది ప్రత్యేక భద్రతా సిబ్బంది (ఎస్పీఎఫ్‌), వీరు కాకుండా 70 మంది ఎన్‌ఎంఆర్‌లు, 100 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది. ఇలా మొత్తం 890 మంది ఉద్యోగులు, సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలోనూ కొందరు అన్యమతస్థులున్నారనే విమర్శలున్నాయి. 
 
ఈ నేపథ్యంలో దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగులందరి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని తాజాగా దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ దేవస్థానం ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల నుంచి డిక్లరేషన్లు తీసుకుంటాం కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్‌బాబు, దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగలందరి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని ఆదేశించాం.

అమ్మవారి సన్నిధిలో పని చేస్తూ అన్యమత విశ్వాసాలతో జీవించేవారు ఇంద్రకీలాద్రిపై ఉంటారని అనుకోవడం లేదు. దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి నుంచి త్వరలోనే డిక్లరేషన్లు తీసుకుంటాం. పున్నమి ఘాట్‌లో జరుగుతున్న కార్యకలాపాలతో దేవస్థానానికి సంబంధం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం (05-12-2019) మీ రాశిఫలాలు - ఆత్మీయులకు కానుకలు...