తిరుమల ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలమని భౌగోళిక, పౌరాణిక, శాసన ఆధారాలతో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసి, సుందరీకరణ చేపట్టాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఆంజనేయస్వామి జన్మస్థాన అభివృద్ధికి ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు విచ్చేస్తారని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
తిరుమలలోని అంజనాద్రిలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి మాఘ పౌర్ణమి పర్వదినం నాడైన ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం జరుగుతుందని వెల్లడించింది.
విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి జీ మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, శ్రీ కోటేశ్వర శర్మ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ ఉత్సవానికి విచ్చేయనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుండి ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కానుందని తెలిపింది.