కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల విడుదల చేసిన కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి సోమవారం టిటిడి పరిపాలనా భవనంలోని కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి తదితరులతో సమీక్ష నిర్వహించారు.
కాగా, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహనసేవలను ఆలయ మాడ వీధుల్లో నిర్వహించాలని అక్టోబరు 1న టిటిడి ప్రకటించింది. అయితే, అక్టోబరు 6న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన నిబంధనలు విడుదల చేసింది. ఈ మేరకు 200 మందికి మించకుండా మాత్రమే మతపరమైన, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని సూచనల్లో పేర్కొంది.
అదేవిధంగా, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు శీతాకాలంలో ప్రముఖ ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో భక్తులు గుమికూడే అవకాశం ఎక్కువగా ఉన్నందున, కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడరాదని కోరింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల మేరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహించాలనే నిర్ణయాన్ని టిటిడి పునఃసమీక్షించింది. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆ మేరకు ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.
ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలన్నీ యధాతథంగా నిర్వహిస్తారు. భక్తుల కోసం వాహనసేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన టిటిడి ప్రజాసంబంధాల విభాగం మీడియాకు ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు, ఫొటోలు అందిస్తుందని, తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.